Translate

Friday, 17 July 2015

విజ్ఞానఖని.... ఆర్యభట్ట...



యుగాలచరిత్ర కలిగిన మన దేశంలో ప్రాచీన విజ్ఞానవేత్తలు ఎందరో తమ రచనల ద్వారా భారతీయ విజ్ఞానసంపదను పరిపుష్టం చేశారు. వేలకోట్ల రూపాయల ఖర్చుతో నేటి శాస్త్రవేత్తలు కనుగొంటున్న విషయాలను కేవలం తమ బుద్ధిబలంతో వారు ఏనాడో ఆవిష్కరించారు. అటువంటివారిలో ఆర్యభట్ట ఒకరు. ఆర్యభట్ట క్రీస్తు శకం 476 మార్చి 21వ తేదీన కేరళలోని 'అశ్మకదేశం` (నేటి తిరువాన్కూరు ప్రాంతం)లో జన్మించారు. ఆ తర్వాత పాట్నాకు సమీపంలో ఉన్న కుసుమపురం లో కొంతకాలం నివసించారని తెలుస్తోంది. పుట్టుకతో అబ్బిన పరిశీలన సామర్థ్యంతో తన 18వ ఏటనే నలంద విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను పూర్తిచేశారు. ఖగోళంపై ఆసక్తి కలిగిన ఆర్యభట్ట 23వ ఏటనే ఖగోళ పరిశోధనలకు ప్రామాణిక గ్రంథంగా పేర్కొనదగిన 'ఆర్యభట్టీయం` అనే గ్రంథం రచించారు. ఇది ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందింది. అనంత విశ్వంలోని గ్రహగమనాలకు ఖచ్చితమైన గణనలను ఈ గ్రంథంలో పొందుపరిచారు. అప్పటి గుప్తరాజు బుద్ధగుప్తుడు ఆర్యభట్ట మేథస్సుని గుర్తించి నలంద విశ్వవిద్యాలయానికి కులపతిగా నియమించాడు.
ఆర్యభట్టీయం నాలుగు పాదాలుగా విభజింపబడింది. గీతికపాదం, గణితపాదం, కాలక్రియాపాదం, గోళపాదంలుగా విభజింపబడ్డ ఆర్యభట్టీయం మొత్తం 121 శ్లోకాలు కలిగిఉంది. గీతికపాదంలో సంఖ్యలను సూచించడానికి అక్షరాలు ఉపయోగించే విధానం, సూర్యభ్రమణాల సంఖ్య, భూపరిభ్రమణం, పగలు, రాత్రి ఏర్పడడం, గ్రహగతులు, కొలతలు, కాంతివిక్షేపం తదితర అంశాలు ఉన్నాయి. గణితపాదంలో వర్గం, వర్గమూలం, ఘనం, ఘనమూలం, క్షేత్రగణితం, సైన్ పట్టికలు, బీజగణితం, శ్రేఢులు, ఎత్తులు, దూరాలు తదితర గణిత అంశాలున్నాయి. కాలపాదంలో కాలమానం, గ్రహగతులు గురించి వివరించారు. గోళపాదంలో గ్రహాల పరిభ్రమణం, అయనాలు, నక్షత్రాల చలనం, భూమికి నలువైపులా జలవాయు ప్రసారం, అనిశ్చిత సమీకరణ సాధన, సాపేక్ష సిద్ధాంతం, కాంతి విక్షేపం మొదలైన అంశాలున్నాయి.
ఆర్యభట్టీయం గొప్పదనానికి దానికి ఉన్న అసంఖ్యాక వ్యాఖ్యానాలే నిదర్శనంగా నిలుస్తాయి. 'ఆర్యభట్టీయం` పేరుతో ఇంగ్లీషులోకి, 'అజ్ బబాహర్' పేరుతో అరబ్బీలోకి అనువాదం పొందింది. ఆర్యభట్ట ప్రతిపాదించిన 'కుట్టకం' అనే పద్ధతి నేటి కంప్యూటర్లకు ఎంతో అనువైనదిగా శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఆర్యభట్టీయానికి బ్రహ్మగుప్తుడు వ్రాసిన 'ఖండఖాద్యక' అన్న వ్యాఖ్యానం కూడా ప్రపంచప్రసిద్ధి పొందింది.
ప్రపంచ విజ్ఞానవేదికపై భారతీయ కీర్తిపతాకాన్ని వేల సంవత్సరాల క్రితమే ఆవిష్కరించిన వారు ఆర్యభట్ట. వారి స్మృతికి చిహ్నంగా భారత ప్రభుత్వం తన తొలి అంతరిక్ష ఉపగ్రహానికి ' ఆర్యభట్ట ' పేరు పెట్టింది. ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ నిర్వహించిన ఆర్యభట్ట 1500వ జయంతి ఉత్సవాలను (1976) అప్పటి ప్రధాని ఇందిర ప్రారంభించారు.
ఆర్యభట్ట పరిశోధనలు :
'పై' విలువ ఖచ్చితంగా 3.1416 అని ప్రకటించారు.
త్రిభుజ, వృత్త వైశాల్యాలు కనుగొనడానికి సూత్రాలు ప్రతిపాదించారు.
అవ్యక్త రాశులకు అక్షరాలు వాడే విధానాన్ని ప్రవేశపెట్టారు.
అంక గణిత పట్టికలు తయారుచేశారు.
భూమి ఒక అక్షాన్ని ఆధారం చేసుకుని తన చుట్టూ తాను పరిభ్రమిస్తుందని ప్రకటించారు.
భూభ్రమణ కాలం 23 గంటల 56 నిమిషాల 4.1 సెకన్లుగా గణించారు. ఆధునికులు ఇదే సమయాన్ని 23 గంటల 56 నిమిషాల 4.091 సెకన్లుగా కనుగొన్నారు.
సంవత్సరానికి 365.3586 రోజులు అని తెలియజేశారు. ఆధునికులు కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు.
వడ్డీలెక్కలు, కాలగణనలకు సూత్రాలను నిర్ణయించారు.
ఒకట్లు, పదులు, వందలు స్థానాలు అనే పద్ధతిని తొలిగా ప్రవేశపెట్టారు.
పైథాగరస్ కు ముందే ఆ సిద్ధాంతాన్ని ప్రకటించారు.
వృత్తపరిధి, పట్టక ఘనపరిమాణం, ఘనమూల సూత్రాలను తయారుచేశారు.
సూర్యోదయం నుంచి మరుసటిరోజు సూర్యోదయానికి ఒక రోజు అని ప్రతిపాదించారు. దీన్నే నేటికీ అనుసరిస్తున్నారు.
తొలిసారిగా గ్రహణాల గురించి ఖగోళపరంగా ఖచ్చితమైన వివరణ ఇచ్చారు.
కొసమెరుపు :
బీహార్ రాష్ట్రంలోని పాట్నా సమీపంలో 'తారేగణ్' అనే ప్రాంతంలో ఆర్యభట్ట గ్రహగమనాల పరిశీలనకు ఒక ప్రయోగశాలను ఏర్పాటు చేసుకున్నారు. అక్కడినుంచే తన ఖగోళ పరిశోధనలను చేశారు. కాలక్రమంలో ఆ ప్రాంతాన్ని విస్మరించారు. 2009లో ఏర్పడిన సంపూర్ణ సూర్యగ్రహణాన్ని అధ్యయనం చేసేందుకు పాశ్చాత్య పరిశోధకులు ఇక్కడినుండే పరిశోధనలు చేశారు. భారతీయ మేధావులు ఆ విషయాన్ని గ్రహించకపోవడం విచారాన్ని కలిగించే అంశం.
పాశ్చాత్య ఆవిష్కరణలే అత్యున్నతమైనవిగా భావిస్తున్న నేటి యువతరానికి ఆర్యభట్ట జీవితచరిత్ర స్ఫూర్తికలిగిస్తుంది. మనవైన విజ్ఞాన శాస్త్ర పరిశోధనలపై, భారతీయ శక్తియుక్తులపై నమ్మకం పెంచుతుంది.
                                                                                                                                                                   

No comments:

Post a Comment